

బ్రెజిల్‌లోని పారైబా రాష్ట్రంలో జోర్లాన్ లోపెస్ డా సిల్వా అనే 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు గత మూడు నెలల్లో జరిగిన 16 హత్యలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారుమూల అడవుల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని దాక్కునేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. స్థానికులు అతడి బలహీనమైన శరీరాకృతి కారణంగా ‘దోమ’ అనే మారుపేరుతో పిలిచేవారని వెల్లడించారు. సుమారు రెండు రోజుల పాటు సాగిన గాలింపు అనంతరం ములుంగు ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతడు మహిళ దుస్తులు, విగ్ ధరించి, ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్నాడు. ఆ చిన్నారి అతడికి బంధువు కాదని అధికారులు తెలిపారు.
విచారణలో డా సిల్వా తన మొదటి హత్యను 13 ఏళ్ల వయసులోనే చేసినట్లు చెప్పినట్లు అధికారులు తెలిపారు. తన జీవితంలో సుమారు 80 మందిని హత్య చేసినట్లు కూడా అతడు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ, ఈ సంఖ్యను పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు. ఇప్పటివరకు 16 హత్యలతో అతడికి సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. తాను నేరస్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నానని డా సిల్వా చెప్పినప్పటికీ, పోలీసులు ఈ వాదనను అంగీకరించడం లేదు. అతడిపై మరిన్ని హత్యలు, గత నేరాలు, నేర సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్ట్ సమయంలో అతడి వద్ద ఉన్న చిన్నారి గురించి కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!