

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి, గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన ఓ మహిళ ఏడు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఓ ముఠా మహిళను సంప్రదించి పసికందును తమ వెంట తీసుకెళ్లింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ముఠా చిన్నారిని రూ.లక్షకు విక్రయించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని చిన్నారిని గుర్తించేందుకు, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బిహార్ మహిళకు ఇది మూడో కాన్పు కాగా, ఈసారి కూడా ఆడపిల్లే జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ముఠా సభ్యులు మహిళను సంప్రదించి, ముగ్గురు ఆడపిల్లలు ఉంటే డబ్బులు వస్తాయని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పసికందును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారి విక్రయం వెనుక ఉన్న ఇతర వివరాలపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ డీసీపీ పర్యవేక్షణలో పోలీసుల బృందం ఈ కేసును ఛేదించినట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!