

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వర్ష బీభత్సంతో అతలాకుతలమయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గురువారం కూడా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 143 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. విశాఖపట్నంలోని కస్తూరి నగర్‌లో కొండచరియలు విరిగిపడగా, టి.నగరపాలెం సమీపంలో గోస్తనీ నదిపై ఉన్న మట్టికట్ట కొట్టుకుపోయింది. శ్రీకాకుళం జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా వరి పంట నీటమునిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, రహదారులు దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో బలమైన సుడిగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. గురువారం ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!