

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 షెడ్యూల్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 27 ప్రధాన క్రీడా విభాగాలతో పాటు ఒక ప్రదర్శన క్రీడ ఉండనుంది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం కాంప్లెక్స్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సహా వివిధ వేదికల్లో 22 పతక విభాగాల పోటీలు నిర్వహించనున్నారు. మిగిలిన పోటీల్లో ఆర్చరీని ఖమ్మంలో, అథ్లెటిక్స్‌ను హనుమకొండలో, జూడోను కరీంనగర్‌లో, టేబుల్ టెన్నిస్‌ను నిజామాబాద్‌లో, కబడ్డీని మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తారు. ఈ క్రీడల్లో సుమారు 6,000 మంది అథ్లెట్లు, 1,800 మంది సహాయక సిబ్బంది పాల్గొంటారని అంచనా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈసారి సాఫ్ట్‌బాల్‌ను తొలిసారిగా పోటీ క్రీడగా చేర్చగా, సెయిలింగ్‌ను ప్రదర్శన క్రీడగా నిర్వహించనున్నారు. యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఖేలో ఇండియా వేదికగా నిలుస్తుందని మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. సముద్రాలు, పర్వతాలు వంటి సహజ వనరులతో ముడిపడిన క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈసారి పోటీ విభాగాల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, గట్కా, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కలరిపయట్టు, ఖో-ఖో, మల్లఖంబ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, థాంగ్ తా, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగాసన ఉన్నాయి. గత ఏడాది మే 3 నుంచి 15 వరకు బిహార్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మహారాష్ట్ర 58 స్వర్ణాలు, 47 రజతాలు, 53 కాంస్యాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!