

ఉత్తర్‌ప్రదేశ్‌లోని తాజ్ ట్రపేజియం జోన్ (టీటీజెడ్) పరిధిలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 454 చెట్లను నరికివేసిన స్థిరాస్తి వ్యాపారి శంకర్ అగర్వాల్‌కు భారీ జరిమానా విధించారు. మథుర-బృందావన్‌లోని దాల్మియా ఫామ్స్‌ను కొనుగోలు చేసిన ఆయన.. 2024 సెప్టెంబరులో ఇళ్ల నిర్మాణం కోసం రాత్రికి రాత్రే 454 చెట్లను తొలగించారు. ఆ భూమి ఆయన సొంతమైనప్పటికీ, సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కమిటీ పర్యవేక్షణ పరిధిలో ఉండటంతో ఈ చర్యపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. 2025 మార్చిలో జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక్కో చెట్టుకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.4.54 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
దీంతోపాటు పర్యావరణ నష్టానికి పరిహారంగా రూ.2 కోట్లు వెచ్చించి తొమ్మిది ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు వ్యాపారి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. అలాగే శంకర్ అగర్వాల్ నెల రోజుల జైలు శిక్ష కూడా అనుభవించినట్లు వెల్లడించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసు ముగింపు సందర్భంగా ఆయనకు మరో రూ.50 లక్షల జరిమానా విధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!