

కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా లక్ష్యం నెరవేరడం లేదు. ముఖ్యంగా కౌలు రైతులు సాగు చేస్తున్న భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించేందుకు అధికారిక వ్యవస్థ లేకపోవడం రుణాల మంజూరుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని బ్యాంకుల ఉన్నతాధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. బ్యాంకులు కౌలు రైతులకు 7 శాతం వడ్డీతో పంట రుణాలు అందించే అవకాశం ఉన్నప్పటికీ.. అవి అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ 24 నుంచి 60 శాతం వరకు అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కౌలు రైతులు సంఘాలుగా ఏర్పడితే వాటి పేరుతో పంట రుణాలు మంజూరు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ.. గ్రామస్థాయిలో సంఘాల ఏర్పాటు, రుణాల మంజూరుకు సహకరించే బాధ్యతను అధికారులు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండానే భూ భారతి పోర్టల్‌లో పంట రుణాల మంజూరు, సంబంధిత వివరాల నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే కౌలు రైతులకు మాత్రం ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో వారి రుణ దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయాలని బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా భూ భారతి పోర్టల్‌లో కౌలు రైతులకు సంబంధించిన రుణ ఛార్జీల నమోదు ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!