

అగ్రిగోల్డ్ కుంభకోణ బాధితులకు ఊరట కల్పించే దిశగా తెలంగాణ సీఐడీ కీలక చర్యలు చేపట్టింది. రూ.447 కోట్ల కుంభకోణానికి సంబంధించి సుమారు 1.65 లక్షల మంది బాధితుల వివరాలను సేకరించి, వారి బాండ్లను ధ్రువీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఐడీ చీఫ్ చారుసిన్హా శనివారం వెరిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో జిల్లా, మండలాల వారీగా వెరిఫికేషన్ కేంద్రాలు, తేదీల వివరాలను ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఇప్పుడు బాధితుల బాండ్ పత్రాలు, ఇతర ఆధారాల పరిశీలనపై దృష్టి సారించింది.
ఈ నెల 25 నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది జులై 30 వరకు కొనసాగనుంది. రోజుకు 250 మంది డిపాజిటర్ల వివరాలను పరిశీలించనున్నారు. బాధితులు తమకు కేటాయించిన తేదీ, కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత అధికారుల ఎదుట హాజరుకావాలని సీఐడీ సూచించింది. వెరిఫికేషన్ కోసం అసలు బాండ్ లేదా నగదు రసీదు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంకుకు అనుసంధానమైన మొబైల్ నంబరు, ఏజెంట్ వివరాలు సమర్పించాలి. డిపాజిటర్ రాలేని పక్షంలో అధీకృత లేఖ ద్వారా కుటుంబ సభ్యులు హాజరుకావచ్చు. డిపాజిటర్ మరణించినట్లయితే నామినీ, డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించిన సందర్భంలో చట్టబద్ధ వారసులు పత్రాలు సమర్పించవచ్చు. ఏజెంట్లు కూడా బాండ్ల వివరాలను అందించవచ్చని సీఐడీ తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!