

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. నవంబర్ 22 వరకు తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న అనుమతులు, కేంద్ర ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వేగంగా మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా పర్యావరణ అనుమతుల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల పూర్తి నీటిమట్టానికి మహారాష్ట్ర అంగీకారం తెలిపేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అదనపు ముంపునకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని వివరించారు. సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి త్వరగా ఎన్‌ఓసీ ఇప్పించాలని కూడా ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ముంపు నివేదికను సమర్పించామని, అదనపు డీపీఆర్ కోసం కోరిన మొత్తాన్ని కూడా జమ చేశామని వెల్లడించారు. సమ్మక్క–సారలమ్మ డీపీఆర్‌ను తొలిసారి సమర్పించిన సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే పరిశీలించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. నవంబర్ 16న కేంద్ర జల సంఘం చైర్మన్‌ను ఉత్తమ్ కలవనుండగా, నవంబర్ 17న సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు.
2027–28 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద నాలుగు ప్రాజెక్టుల కోసం రూ.5,856 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించినట్లు ఉత్తమ్ తెలిపారు. సీతమ్మసాగర్–సీతారామ సమీకృత పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరానికి రూ.178 కోట్లు, చనాకా–కొరాట ప్రాజెక్టుకు రూ.103 కోట్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర మూలధన పెట్టుబడి ప్రోత్సాహక పథకం కింద ఇప్పటివరకు తెలంగాణకు రూ.1,457 కోట్లు అందాయని, 70 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల తుది పనుల కోసం అదనంగా రూ.5,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నిధులు అందితే 2027 మార్చి 31లోగా వాటిని వినియోగించి, ఏడాదిలో కొత్త ఆయకట్టుకు నీరందిస్తామని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, పడిపోతున్న భూగర్భ జలమట్టాలపై కూడా ప్రధానికి వివరించామని, కేంద్ర భూగర్భ జల మండలి సెప్టెంబర్ నివేదికను అందించామని చెప్పారు. భూగర్భ జలాల పెంపు, పరిరక్షణ కోసం రూ.5,000 కోట్ల ప్రత్యేక కేంద్ర సాయం కోరినట్లు వెల్లడించారు. వచ్చే వానాకాలం వరకు తాగునీటికి సరిపడా నిల్వలను రిజర్వాయర్లలో ఉంచామని, ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చినట్లు ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల రూపకల్పన, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు నిపుణుల నివేదిక పేర్కొందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ దెబ్బతిందని, రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి 30 శాతం పనులు పూర్తిచేసిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మళ్లించారని ఆరోపించారు. కమిషన్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుతం దిగువ ప్రాంతాల్లో దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నామని తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!