

రాష్ట్రంలో 22ఏ కింద ఉన్న భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస అవసరాలకు వినియోగంలోకి వచ్చిన అర్హత కలిగిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. సంబంధిత నాలా రుసుము చెల్లించిన అనంతరం అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేసి, అర్హత ఉన్న దరఖాస్తులను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని ఆదేశించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చే ప్రక్రియను నాలా చట్టం నియంత్రిస్తుంది.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఐదు జీవోలు జారీ చేసింది. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి కల్పించింది. అలాగే కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!