

తెలంగాణలో పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లలో వివరాల సవరణకు పాఠశాల విద్యాశాఖ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకునేందుకు మీ-సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఆఫ్‌లైన్, మాన్యువల్ దరఖాస్తుల విధానాన్ని నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మీ-సేవ కేంద్రంలో సమర్పించిన దరఖాస్తు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఆన్‌లైన్‌లో చేరుతుంది. పాఠశాల రికార్డులు, విద్యార్థి సమాచారాన్ని పరిశీలించిన అనంతరం హెడ్‌మాస్టర్ దరఖాస్తును MEOకు పంపిస్తారు. అక్కడి నుంచి DEO కార్యాలయం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగానికి చేరుతుంది. తుది ఆమోదం లభించిన అనంతరం సవరించిన SSC మెమోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఏ దశలోనైనా దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇకపై SSC సర్టిఫికెట్ల సవరణకు సంబంధించిన భౌతిక లేదా మాన్యువల్ దరఖాస్తులను విద్యాశాఖ కార్యాలయాలు స్వీకరించవు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!