

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో 41 కొత్త 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కోర్ అర్బన్ రీజియన్ (క్యూఆర్) పరిధిలో 14 బార్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 27 బార్లు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామాల విలీనం, పెరిగిన జనాభాకు అనుగుణంగా 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
క్యూఆర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని 14 బార్లకు అబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంతో పాటు సంబంధిత డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇతర జిల్లాల్లోని బార్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్, కమిషనర్, డీపీఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 2బీ బార్లకు వార్షిక ఎక్సైజ్ ఫీజు రూ.44 లక్షలు, నిజామాబాద్ బోధన్ బార్‌కు రూ.42 లక్షలు, మిగిలిన బార్లకు రూ.30 లక్షలుగా నిర్ణయించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!