

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రెండు రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5కు మార్చే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3న జరగనుంది. అదే రోజు పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తే పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం న్యాయ నిపుణులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమాలోచనలు రాత్రి 9.30 గంటల వరకు కొనసాగాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి అందిన నివేదికలను పరిశీలిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్టాండింగ్ కౌన్సిల్ అశ్వనీకుమార్, ఐజీ రాజకుమారి, ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున, ఇతర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఏ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని ఏ డివిజన్లు, వార్డులకు మరోసారి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానం ఏమిటి? అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం రాత్రి 9.50 గంటలకు ఎస్‌ఈసీ పునేఠా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ తేదీ మార్పుపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!