

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 18 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. ప్రభుత్వ ఆమోదం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతి లభించిన వెంటనే అధికారికంగా పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు. ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 10తో ముగియనున్నాయి. ఆరు సబ్జెక్టులకు మొత్తం ఏడు పేపర్లు ఉండటంతో విద్యార్థులు ఏడు రోజులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సైన్స్ సబ్జెక్టులో భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు గతేడాది మాదిరిగానే పరీక్షల మధ్య తగిన వ్యవధి ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ పరీక్షలకు సుమారు 5.25 లక్షల నుంచి 5.50 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు.
మరోవైపు, పదో తరగతి ఒరిజినల్ మార్కుల మెమోలో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను సవరించుకునే విధానంలో మార్పులు చేశారు. ఇకపై ఈ సవరణల కోసం మీ సేవా పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ డీఈఓలను ఆదేశించారు. ఆఫ్‌లైన్, మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించరాదని స్పష్టం చేశారు. మీ సేవా కేంద్రంలో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే, ఆ సమాచారం సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చేరుతుంది. హెచ్‌ఎం ఆమోదించిన తర్వాత దరఖాస్తుదారులు సర్టిఫికెట్లలో మార్పుల కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డును సంప్రదించాల్సి ఉంటుంది. గతంలో అనుసరించిన విధానంతో పోలిస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!