

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పీక్ పవర్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో 15 వేల మెగావాట్లలోపు, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ అవసరం భారీగా పెరిగిందన్నారు. విద్యుత్ రంగంపై కొందరు నేతలు తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. డిస్కామ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వాటిని బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే సమస్యలు, జాప్యం ఏర్పడ్డాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్లాంట్‌కు 2015లో ఎల్‌ఓఐ ఇచ్చినప్పటికీ, అవసరమైన బొగ్గు కేటాయింపులు, రవాణా ఏర్పాట్లలో గత పాలకులు విఫలమయ్యారని అన్నారు. 2014–2024 మధ్య 14 బొగ్గు బ్లాకులు మూతపడటంతో సింగరేణి సుమారు 15 మిలియన్ టన్నుల ఉత్పత్తిని కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రికి బొగ్గు మళ్లిస్తున్నా అది శాశ్వత పరిష్కారం కాదని, ప్లాంట్‌కు శాశ్వత బొగ్గు కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.6.66గా ఉండగా, కాకతీయలో రూ.4.17, భద్రాద్రిలో రూ.4.60గా ఉందని పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి వ్యయం చివరకు వినియోగదారులపై, అంటే తెలంగాణ ప్రజలపై భారం అవుతుందని భట్టి అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!