

కశ్మీర్‌లో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఉద్యోగులకు సూచించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కొందరు పండిట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటామని, వారి పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలతో కూడిన బెదిరింపు లేఖ వెలువడినట్లు సమాచారం. ఈ లేఖ వెనుక లష్కరే తయ్యిబా (LeT)తో సంబంధం ఉన్న గ్రూపు ఉందనే అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా పరంగా అధికారులు పలు ముందస్తు చర్యలు చేపట్టారు.
బెదిరింపుల నేపథ్యంలో వందలాది కశ్మీరీ పండిట్ ఉద్యోగులను ఆగస్టు 25 వరకు సెలవుపై పంపినట్లు సమాచారం. బెదిరింపు లేఖలో పేర్లు ఉన్న ఉద్యోగులను సురక్షితంగా జమ్మూకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 2022లోనూ కశ్మీరీ పండిట్ ఉద్యోగులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పీఎం ప్యాకేజీ ఉద్యోగులు జమ్మూకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. అనంతరం శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లోని సురక్షిత ప్రాంతాల్లో వారికి పోస్టింగ్‌లు కల్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!