

వైష్ణవ సంప్రదాయంలో కైశిక ద్వాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కార్తిక శుద్ధ ద్వాదశి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పంచబేరాల్లో ఒకరైన ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. సాధారణంగా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 గంటల మధ్య జరిగే ఈ ఉత్సవం ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించడం విశేషం. సూర్యోదయానికి ముందే ఊరేగింపును ముగించి స్వామివారిని తిరిగి ఆలయంలోకి తీసుకువెళ్తారు. ఈ పర్వదినానికి నంబదువాన్ భక్తుడి కథతో సంబంధం ఉంది. కైశిక రాగంలో స్వామివారికి సంకీర్తన సమర్పించేందుకు వెళ్తున్న నంబదువాన్‌కు మార్గమధ్యంలో బ్రహ్మరాక్షసుడు ఎదురవుతాడు. తిరిగి వస్తానని మాట ఇచ్చిన నంబదువాన్, స్వామివారికి తన సంకీర్తనను సమర్పించి ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మరాక్షసుడి వద్దకు తిరిగి వస్తాడు. అతని భక్తికి, సత్యనిష్ఠకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఇద్దరికీ మోక్షం ప్రసాదించినట్లు పురాణ కథనం.
ఈ ఉత్సవంలో అత్యంత ప్రత్యేకమైన అంశం ఉగ్ర శ్రీనివాసమూర్తిపై సూర్యకిరణాలు పడకుండా చూడటం. 14వ శతాబ్దంలో ఊరేగింపు సమయంలో స్వామివారిపై సూర్యకిరణాలు పడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఆలయ సంప్రదాయ కథనం చెబుతోంది. అప్పటి నుంచి సూర్యోదయానికి ముందే ఊరేగింపును పూర్తి చేయడం ఆనవాయితీగా మారింది. ఊరేగింపు అనంతరం స్వామివారిని అమ్మవార్లతో కలిసి బంగారు వాకిలి వద్దకు తీసుకువచ్చి అర్చకులు వేద, పురాణ పఠనాలతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ అరుదైన ఉత్సవాన్ని వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ రోజున ఉగ్ర శ్రీనివాసమూర్తిని దర్శించుకుంటే ఆపదల నుంచి రక్షణ లభించి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!