

చైనాకు అమెరికా కంపెనీల నుంచి దాదాపు 9 లక్షల ఏఐ చిప్‌లు ఎగుమతి అయినట్లు వెల్లడైన వివరాలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ కార్యవర్గం అనుమతితో 2025 డిసెంబరు నుంచి 2026 మే మధ్య ఎన్విడియా, ఏఎండీ సంస్థలు మొత్తం 8,79,000 చిప్‌లను చైనా కంపెనీలకు సరఫరా చేసినట్లు అమెరికా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ విడుదల చేసిన లైసెన్సింగ్ డేటా వెల్లడించింది. అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతితో జరిగిన ఈ ఎగుమతుల్లో అలీబాబాకు 75 వేల చిప్‌లు, టెన్సెంట్‌కు 1.5 లక్షలు, బైడూకు 43 వేలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీకి 4 వేల చిప్‌లు అందినట్లు పేర్కొంది. ఈ నాలుగు సంస్థలకూ చైనా మిలిటరీతో సంబంధాలున్నట్లు పెంటగాన్ జాబితాలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే ఆరు నెలల వ్యవధిలో చైనాకు దాదాపు 34 లక్షల ఏఐ చిప్‌లను ఎగుమతి చేసేందుకు కంపెనీలు అనుమతులు కోరినట్లు డేటా చెబుతోంది. అయితే, ఎన్ని చిప్‌లకు లైసెన్సులు మంజూరయ్యాయనే పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఎన్విడియా హెచ్200 ప్రాసెసర్లు, ఏఎండీ MI325X చిప్‌ల ఎగుమతికి అనుమతులు లభించినట్లు కమిటీ పేర్కొంది. అమెరికా నుంచి ఎగుమతి అయిన ఏఐ చిప్‌లలో దాదాపు 30 శాతం చైనా మిలిటరీతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు చేరాయన్న అంశం జాతీయ భద్రతపై ఆందోళనలను పెంచింది. దీనిపై ఎన్విడియా స్పందిస్తూ.. కఠినమైన షరతులు, పరిమితులకు లోబడే ఎగుమతి లైసెన్సులు లభించాయని, ప్రస్తుతం చైనాకు హెచ్200 చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు తెలిపింది. అమెరికా ఎగుమతి నియంత్రణ చట్టాలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలు సాగుతున్నాయని ఏఎండీ పేర్కొంది. ఈ వ్యవహారంపై చైనా కంపెనీలు, ఆ దేశ దౌత్య కార్యాలయం ఇంకా స్పందించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!