

దీపావళి వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా టపాసులు కాల్చడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో ఒక్కరోజు జరుపుకునే పండుగ సంబరాలపై కాలుష్యం పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయోధ్యలో తాను కూడా దీపావళి వేడుకల్లో పాల్గొని టపాసులు కాల్చినట్లు గుర్తుచేశారు. పండుగలపై ఆంక్షలు విధించడాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించదని, ప్రజలు స్వేచ్ఛగా సంబరాలు చేసుకోవాలని కోరుకుంటుందని స్పష్టం చేశారు.
కాలుష్యం విషయంలో కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని యోగి విమర్శించారు. వ్యవస్థలోని అవినీతి వంటి అంశాలపై ప్రశ్నించని వారు, ప్రజలు పండుగ సందర్భంగా ఒక్కరోజు టపాసులు కాల్చితే మాత్రం కాలుష్యం గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. టపాసుల వల్ల ఏర్పడే కాలుష్యం కొంత సమయం తర్వాత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, దీపావళికి ముందు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. నవంబర్ 9న ఢిల్లీలో ఏక్యూఐ 371కు చేరుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2021 తర్వాత నమోదైన అత్యంత అధ్వాన స్థాయిగా ఇది పేర్కొనబడింది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటడంతో గాలి నాణ్యత 'తీవ్ర' స్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడి 'పూర్' కేటగిరీకి వచ్చినట్లు నివేదికలు తెలిపాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!