

మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ పోర్టుగా గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. దిగుమతులు, ఎగుమతులు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) రామాయపట్నం పోర్టును కస్టమ్స్ పోర్టుగా నోటిఫై చేయడాన్ని ఆయన కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ పరిణామం తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి పోర్టులే చోదక శక్తులని, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు చొప్పున తీరప్రాంత మౌలిక వసతులు కల్పించడంతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు.
రామాయపట్నం పోర్టును ప్రధాన పారిశ్రామిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని జగన్ పేర్కొన్నారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడ్డాయని, బీపీసీఎల్ భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందడుగు పడిందని తెలిపారు. ఇండోసోల్ సమగ్ర సోలార్ తయారీ పరిశ్రమతో పాటు మరిన్ని భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, తద్వారా బలమైన పారిశ్రామిక వ్యవస్థకు పునాది పడుతుందని పేర్కొన్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల నుంచి సీఐఐ పెట్టుబడుల సదస్సుల వరకు ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తావిస్తున్న పోర్టులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించినవని జగన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలనే ప్రస్తుత ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!