

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న ‘హైందవ’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అదే రోజున రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘మైసా’, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’, విజయ్ ఆంటోనీ నటించిన ‘నాన్నకుట్టి’ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకేరోజు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. థియేటర్ల కేటాయింపు, స్క్రీన్ల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ‘హైందవ’ విడుదల తేదీని మార్చాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం.
అయితే సినిమా వాయిదాపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు చిత్రబృందం ప్రమోషన్లు ప్రారంభించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టికల్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో జేడీ చక్రవర్తి, శుభలేఖ సుధాకర్, మహేష్ మంజ్రేకర్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పురాతన ఆలయంలో విగ్రహాలు మాయమవడం, ఆ తర్వాత చోటుచేసుకునే హత్య కేసు చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!