

టాలీవుడ్‌లో నవంబర్, డిసెంబర్ నెలల సినిమా విడుదల ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’, నాగచైతన్య ‘వృషకర్మ’, నాగార్జున ‘కింగ్ 100’ చిత్రాలు వాయిదా పడే సూచనలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా నవంబర్ 27న విడుదల కావాల్సిన ‘మైసా’ సినిమా సెన్సార్ ప్రక్రియ, తుది ప్రతిని సిద్ధం చేయడంలో ఆలస్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. డిసెంబర్ 4న విడుదల చేసే అంశాన్ని కూడా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘వృషకర్మ’ కూడా అదే విడుదల తేదీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కు సంబంధించిన నిర్మాణానంతర పనులు ఇంకా పూర్తికాకపోవడంతో కొత్త విడుదల తేదీ కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నాగార్జున నటిస్తున్న వందో చిత్రం ‘కింగ్ 100’ కూడా డిసెంబర్ 24న కాకుండా జనవరిలో విడుదలయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ మధ్య ఉండాల్సిన పోటీపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ నాగ్ సినిమా వాయిదా పడితే ఆ స్థానంలో నాగచైతన్య ‘వృషకర్మ’ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే బాక్సాఫీస్ పోటీ బాలకృష్ణ వర్సెస్ నాగార్జున నుంచి బాలకృష్ణ వర్సెస్ నాగచైతన్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!