

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర మళ్లీ వేగం పెంచుకున్నట్లు సమాచారం. చాలాకాలంగా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా పనులు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయట. ఇప్పటికే సినిమా ట్రైలర్ కట్ సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ పరిణామాలతో విశ్వంభర విడుదలపై అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. త్వరలోనే చిత్రబృందం నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి, గౌరహరి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. చిరంజీవిని సరికొత్త ప్రపంచంలో, విభిన్నమైన పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ప్రస్తుతం మిగిలిన పనులు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారిక విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విశ్వంభర త్వరలోనే థియేటర్లలో సందడి చేస్తుందా అన్నది చూడాలి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!