

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి శెట్టి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విజయం సాధించడంతో పాటు యువతలో ఆమెకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ, వరుస అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో నటించారు. ప్రస్తుతం జయం రవి సరసన భారీ చిత్రం ‘జీనీ’లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృతి శెట్టి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, కృతి శెట్టి ఓ రొమాంటిక్ ప్రేమకథతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో దర్శకుడు రోహిత్ శెట్టి వద్ద సుదీర్ఘకాలం పనిచేసిన విధి ఘోడ్గాంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్‌పై అభిషేక్ ఎస్. వ్యాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందులో కృతిని సరికొత్త అవతార్‌లో చూపించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్‌లోనైనా కృతికి మంచి విజయం దక్కుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!