

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందని సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్యామ్‌సుందర్ తెలిపారు. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆస్తమా, గుండె జబ్బులతో బాధపడేవారు చలి ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లని గాలికి ఎక్కువగా తిరగకుండా, వీలైనంత వరకు వెచ్చని ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు.
చలికాలంలో ఇంట్లోనే యోగా, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరం వెచ్చగా ఉంటుందని డాక్టర్ శ్యామ్‌సుందర్ వివరించారు. విటమిన్-డి లోపం రాకుండా ఉదయం సుమారు 15 నిమిషాల పాటు ఎండలో గడపడం మంచిదని సూచించారు. చలి కారణంగా కీళ్లు బిగుసుకుపోవడం, రక్తప్రసరణ మందగించడం వల్ల నొప్పులు పెరిగే అవకాశం ఉందన్నారు. క్రమం తప్పకుండా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చని తెలిపారు. చల్లని గాలి శరీరానికి తగలకుండా ఉన్ని స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్ ధరించాలని సూచించారు. ఆహారంలో వేడిగా వండిన పదార్థాలు, సూప్‌లు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని చెప్పారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు సుమారు ఎనిమిది గ్లాసుల నీరు, వీలైతే గోరువెచ్చని నీరు తాగాలని సూచించారు.
చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యుడు సూచించారు. స్నానం చేసిన తర్వాత కొబ్బరినూనె, గ్లిజరిన్ లేదా విటమిన్-ఈ ఉన్న మాయిశ్చరైజర్లను ఉపయోగించడం వల్ల చర్మంలోని తేమను కాపాడుకోవచ్చని తెలిపారు. అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గిపోయే అవకాశం ఉందని, అందువల్ల గోరువెచ్చని నీటినే ఉపయోగించాలని చెప్పారు. బయట ఆహారాన్ని తీసుకోవడం తగ్గించి, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చలి నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని డాక్టర్ శ్యామ్‌సుందర్ తెలిపారు.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు లేదా లక్షణాలు ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించి, వారి సూచనలను పాటించండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!