

ప్రస్తుతం చాలామంది ఫోన్‌లో సోషల్ మీడియా చూస్తూ లేదా టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు దృష్టి ఆహారంపై లేకపోవడంతో ఎంత తింటున్నామనే విషయాన్ని గుర్తించలేకపోవచ్చు. కడుపు నిండిన సంకేతాలను మెదడు సరిగ్గా గుర్తించకపోవడంతో అవసరానికి మించి ఆహారం తీసుకునే ప్రమాదం ఉంది. కొన్ని అధ్యయనాల్లోనూ దృష్టి మళ్లింపుతో భోజనం చేసేవారు ఎక్కువ కేలరీలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీర్ఘకాలంలో ఈ అలవాటు బరువు పెరగడానికి దారితీయవచ్చు.
ఫోన్ లేదా టీవీ చూస్తూ తినేటప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలకుండా త్వరగా మింగే అవకాశం ఉంటుంది. దీనివల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చిన్నారులకు కార్టూన్లు చూపిస్తూ అన్నం తినిపించడం వల్ల వారికి ఆకలి, కడుపు నిండిన భావనపై అవగాహన తగ్గవచ్చు. పిల్లలు ఆహారంలోని రుచి, వాసన, రంగు, ఆకృతిని తెలుసుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో కనీసం ఒక పూట కుటుంబ సభ్యులంతా ఫోన్లు, టీవీలకు దూరంగా కలిసి భోజనం చేయడం మంచిది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా సందేహాల కోసం వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!