

భారతీయ సినిమాలో సంగీతం ఎప్పటినుంచో కథనంలో అంతర్భాగంగా కొనసాగుతోంది. పాటలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా కథను ముందుకు నడిపించడం, పాత్రల భావోద్వేగాలను వ్యక్తం చేయడం, ప్రేమ, విషాదం, సామాజిక అంశాలను ప్రేక్షకులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జానపదం, శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, గజల్స్, కవ్వాలీల వంటి సంప్రదాయాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీయ సినీ సంగీతం ఇప్పుడు కొత్త మార్పులను ఎదుర్కొంటోంది. యువత అభిరుచులు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో తెలుగు సినిమా సంగీతంలో మాస్, క్లాస్, ప్రయోగాత్మక బాణీలు సమాంతరంగా సాగుతున్నాయి. వైరల్ పాటలతో పాటు నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది.
ఇటీవల విడుదలైన చిత్రాలు ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ది ప్యారడైజ్ పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, సింగ్ గీతం, లెనిన్, రావు బహదూర్, డీసీ వంటి చిత్రాలు విభిన్న సంగీత శైలులకు వేదికగా నిలుస్తున్నాయి. వాణిజ్య హంగులతో కూడిన పాటల నుంచి ఒపెరా తరహా సంగీతం, పాటలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చే యాక్షన్ చిత్రాల వరకు భిన్నమైన ప్రయోగాలు కనిపిస్తున్నాయి. దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించిన మా ఇంటి బంగారం కూడా మారుతున్న కథన శైలికి ఉదాహరణగా నిలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో రీల్స్, ప్రత్యేక పాటలకు ఆదరణ పెరగడంతో ఒక్క పాటే సినిమా ప్రచారానికి ప్రధాన సాధనంగా మారుతోంది. దేవిశ్రీ ప్రసాద్ వంటి సంగీత దర్శకులు సంప్రదాయ బాణీలను ఆధునిక శబ్దాలతో మేళవిస్తూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
అయితే కథకు, సంగీతానికి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పటికీ కీలకమైన సవాలుగా ఉంది. ఇరుముడి చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’, కపుల్ ఫ్రెండ్లీలోని మృదువైన సంగీతం, చెన్నై లవ్ స్టోరీలోని బాణీలు భావోద్వేగాలతో కూడిన సంగీతానికి ఉన్న ఆదరణను చాటుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంలోని ‘గోదారి గట్టు మీద’, మన శంకర వర ప్రసాద్ గారులోని ‘మీసాల పిల్ల’ వంటి పాటలు పాత తరహా మెలోడీలకు ఇప్పటికీ ప్రేక్షకాదరణ ఉందని నిరూపిస్తున్నాయి. డిజిటల్ వేదికలతో తెలుగు పాటలు ప్రపంచవ్యాప్తంగా చేరుతున్నప్పటికీ, వ్యూస్, వైరల్ ట్రెండ్స్, హుక్ లైన్స్, రీమిక్స్‌లకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సాహిత్య విలువ, భావగాఢత, మెలోడీ, కొత్తదనం కొన్నిసార్లు వెనుకబడుతున్నాయి. సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకుంటూనే తెలుగు సంగీత సంప్రదాయాన్ని కాపాడుకోవడం భవిష్యత్తు సంగీత దర్శకులకు ముఖ్యమైన బాధ్యత.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!