

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జేమ్స్ బాండ్ ఎట్టకేలకు వచ్చేశాడు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిసన్‌ను తదుపరి 007గా అమెజాన్ MGM స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 16, 2026న ఈ ప్రకటన వెలువడటంతో దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. 2021లో విడుదలైన నో టైమ్ టు డై తర్వాత డేనియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ పాత్రకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొత్త బాండ్ ఎవరనే దానిపై టామ్ హార్డీ, జేమ్స్ నార్టన్, టామ్ హిడిల్‌స్టన్, రెగే-జీన్ పేజ్, జాక్ లోడెన్, జోష్ ఓ’కానర్, కలమ్ టర్నర్ తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చివరకు ట్విలైట్ సాగా చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రాబర్ట్ ప్యాటిసన్‌ను ఎంపిక చేశారు. టెనెట్, ది బ్యాట్‌మ్యాన్ వంటి చిత్రాలతోనూ ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
‘బాండ్ 26’గా పిలుస్తున్న తదుపరి చిత్రానికి డ్యూన్ సిరీస్ దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహించనున్నారు. పీకీ బ్లైండర్స్ సృష్టికర్త స్టీవెన్ నైట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 2025లో బాండ్ ఫ్రాంఛైజీపై సృజనాత్మక నియంత్రణను అమెజాన్ MGM స్టూడియోస్ దక్కించుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు వేగం పుంజుకుంది. దీర్ఘకాలంగా ఈ ఫ్రాంఛైజీ హక్కులను నిర్వహించిన బార్బరా బ్రొకొలి, మైఖేల్ జి. విల్సన్‌లతో కుదిరిన ఒప్పందం అనంతరం నిర్మాణ సంస్థ కొత్త బాండ్ చిత్రంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్యూన్: పార్ట్ త్రీ డిసెంబర్ 18, 2026న విడుదల కానుంది. ఆ చిత్రం తర్వాత ఆయన జేమ్స్ బాండ్ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. కొత్త బాండ్ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్, విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!