

దశాబ్దాలుగా తనదైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. వయసు పెరగడంతో సినిమాల్లో నటించడం తగ్గించినప్పటికీ.. అభిమానులతో ఏదో ఒక రూపంలో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సంపాదన, ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు విలువ, ఇతరులకు చేసే సాయం గురించి బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యమని బ్రహ్మానందం అన్నారు. సినిమా పరిశ్రమలో పలువురు చేసిన ఆర్థిక తప్పులను గమనించి, ఏం చేయకూడదో తాను నేర్చుకున్నానని తెలిపారు. డబ్బు విషయంలో తన క్రమశిక్షణ వల్ల దాదాపు 23 మంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించగలిగానని చెప్పారు. తాను చేసిన సహాయాన్ని ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని పేర్కొన్నారు. అవసరమైన చోట సంపద ఉపయోగపడినప్పుడే దానికి విలువ ఉంటుందని, కోట్ల సంపద ఉన్నా ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ప్రయోజనం లేదని.. రోజంతా కష్టపడి ప్రశాంతంగా నిద్రపోయే వ్యక్తే తన దృష్టిలో నిజమైన కోటీశ్వరుడని బ్రహ్మానందం అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!