

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల స్పందన అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక సినిమా విడుదలైన రెండో రోజు నుంచే వసూళ్లలో తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి తాజాగా యశ్‌కు తన మద్దతు ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ‘టాక్సిక్’పై స్పందించిన రిషబ్, ఇలాంటి ప్రయాణంలో కథ లేదా కొన్ని పాత్రలు ఆశించిన విధంగా సాగకపోవచ్చని అన్నారు. అయితే దాంతో సినిమా ఎంచుకున్న మార్గం తప్పు కాదని అభిప్రాయపడ్డారు. ఒక నటుడు పాత్రను హృదయపూర్వకంగా ఆవిష్కరించడానికి ఎంత నిబద్ధత అవసరమో తనకు తెలుసని, యశ్ చూపించిన అంకితభావం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
లార్జర్ దన్ లైఫ్ పాత్ర కోసం యశ్ తనను తాను మార్చుకున్న తీరు ప్రతి సన్నివేశంలో కనిపించిందని రిషబ్ శెట్టి ప్రశంసించారు. మనిషి జీవితంలో గిల్ట్ కారణంగా టాక్సిసిటీ ఎలా పెరుగుతుందనే అంశాన్ని ప్రయోగాత్మకంగా చూపించడం సాధారణ విషయం కాదని అన్నారు. ‘టాక్సిక్’ విషయంలో యశ్ తీసుకున్న డేరింగ్ స్టెప్‌కు తాను అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కన్నడ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే యశ్ ప్రేమ, తపనకు తమ ప్రేమ ఉంటుందని తెలిపారు. ఈ స్పందనతో యశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఒక కళాకారుడి ప్రయత్నాన్ని మరో స్టార్ హీరో బహిరంగంగా ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!