

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాంత్, ఆచారి వంటి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేయడం దిగజారుడుతనమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదని, రాష్ట్ర సాధన కోసం పోరాడలేదని ఆరోపించారు. కేసీఆర్‌కు సన్నిహితుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు గతంలో శ్రీకాంత్ చారి తల్లికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.
తెలంగాణ కోసం కేసీఆర్ కుమార్తె కవిత ఏం త్యాగం చేశారని, ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆమెకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారని అరవింద్ ప్రశ్నించారు. శ్రీకాంత్ కుటుంబాన్ని గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపాలున్నాయని, ప్రాజెక్టులో అనేక తప్పులు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అవసరమైన మరమ్మతులు చేపట్టకపోవడం తప్పేనని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గ్రావిటీ విధానంలో నిర్మించాలని నిర్ణయించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అహంకారంతో ప్రారంభమై అవినీతితో ముగిసిందని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ సునామీ సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన అరవింద్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో కనుమరుగవుతాయని వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!