

మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ స్థానాలను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలిపేందుకే తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇప్పుడు మార్గం సుగమమవుతోందని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎదురయ్యే ఆందోళనలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కట్టుబడి పనిచేశాయని, ఆ కారణంగా భవిష్యత్తులో రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టపోకూడదని అన్నారు. దేశ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రజలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉండగా, 50 శాతం సీట్లు పెరిగితే ప్రతి 18 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశాలను ప్రస్తావించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలు, ప్రజా రవాణా రంగాల్లో వారికి అవకాశాలు కల్పించేందుకు గతంలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. మహిళలకు రాజకీయాల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల ఎంపీలు బిల్లులకు అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బిల్లును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు మరోసారి అదే తప్పు చేయవద్దని సూచించారు. దేశ ప్రయోజనాలు, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని చంద్రబాబు కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!