

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పంచాయతీ ఎన్నికలు, రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తల్లి, చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచే వారు రాజకీయాల్లో ఉండటానికి అర్హులు కారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలను అవమానిస్తూ రాజకీయ ముసుగులో తిరిగే వ్యక్తులకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల కంటే ప్రజలకు వాస్తవాలను వివరించి, ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కూటమి ఐక్యత శాశ్వతంగా కొనసాగాలని, పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం కంటే ఈసారి గణనీయంగా ఎక్కువ ఓట్లు సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఒక్క వార్డులో ఓటమి ఎదురైనా అందుకు గల కారణాలను సమగ్రంగా విశ్లేషిస్తానని హెచ్చరించారు. గ్రామాలు, నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ, జనసేన, BJP నేతల మధ్య సమన్వయం ఎలా ఉందో పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. నాయకులు పరస్పర సహకారంతో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!