

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది సంఖ్యను గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం ఆదేశించారు. ఆయా అంశాలపై ప్రతి వారం జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన చోట పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపైనా సమీక్షించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడులకు సంబంధించి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!