

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పనితీరు, ప్రభుత్వ పాలనపై సమీక్ష నిర్వహించినట్లు ఏఐసీసీ ఇన్‌ఛార్జి బీఎం సందీప్ తెలిపారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగిందని, అనంతరం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, పార్టీకి చెందిన ఫ్రంటల్ సంస్థలు, విభాగాల అధిపతులు, డీసీసీ అధ్యక్షులతో విడివిడిగా చర్చలు జరిపినట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రులందరితోనూ వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ సంస్థాగతంగా సమర్థంగా పనిచేస్తున్నాయని సందీప్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాబోయే రెండేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. నాయకులందరూ సానుకూలంగా, ఐక్యంగా ఉన్నారని, బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై సంఘటితంగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రాజకీయ, సంస్థాగత పరిస్థితులను అర్థం చేసుకునేందుకు నిన్నటి నుంచి నాయకులతో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నట్లు తెలిపారు. మీనాక్షి కూడా తెలంగాణలో చాలా కాలం పాటు పనిచేశారని సందీప్ గుర్తుచేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!