

తాడేపల్లి: రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు పాలనలో ఆలయాలపై విధ్వంసకాండ కొనసాగుతోందని ఆరోపించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన అంజనేయపురంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు.
తిరుమలలో చారిత్రక వెయ్యికాళ్ల మండపం కూల్చివేతతో మొదలైన విధ్వంసం కొనసాగుతోందని జగన్ ఆరోపించారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేశారని, బద్వేల్‌లోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో సత్రాలను కూడా తొలగించారని ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా పవిత్ర ఆలయాలపై బుల్డోజర్లు నడపడమేనా పాలన అంటే అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం చారిత్రక ఆలయాలను కూల్చివేస్తోందని విమర్శించారు. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే చంద్రబాబు ఆలయాల కూల్చివేతలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తూ, ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!