

ఓటరుగా నమోదుకు పౌరులు ఉపయోగించే ఫారం 6లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా మార్పులు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. ఫారం 6లో ఎటువంటి మార్పులు చేయలేదని, బిహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సందర్భంగా.. ఆ ఫారంకు ఒక డిక్లరేషన్ సమర్పించాలని మాత్రమే ఈసీ 2025 జూన్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన తీర్పులో సమర్థించిందని గుర్తు చేశారు. ఈసీ ఇటీవల జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్నే వెల్లడించామని పేర్కొన్నారు.
ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన పేరు లేదా తల్లిదండ్రుల పేర్లు లేదా తాత నానమ్మల పేర్లు గత ఎస్‌ఐఆర్‌లో ఉన్నాయా? లేవా? అనే అంశంపై ఈ డిక్లరేషన్‌లో స్పష్టతనివ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న దశలో మాత్రమే డిక్లరేషన్ అడిగామని, ఎస్‌ఐఆర్ ముగిసిన తర్వాతగానీ, ఎస్‌ఐఆర్ జరగని రాష్ట్రాల్లోగానీ దానిని అడగలేదని ఈసీ పేర్కొంది. కాగా, తన ఆన్‌లైన్ పోర్టళ్ల నుంచి డిక్లరేషన్‌ను ఈసీ తొలగించటం గమనార్హం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!