

హర్యానా మ్యూజిక్ ఇండస్ట్రీలో తన డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి, డ్యాన్సర్ సప్నా చౌదరి వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ భర్త వీర్ సాహు నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడిన సప్నా.. తమ మధ్య ఏం జరిగిందో తనకు, వీర్‌కు మాత్రమే తెలుసని స్పష్టం చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కలిసి జీవించామని, బంధం సజావుగా సాగని పరిస్థితుల్లో విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. తమ వ్యక్తిగత జీవితంపై ఇతరులు తీర్పులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. ప్రేమ అనేది కేవలం శారీరక ఆకర్షణ కాదని, అది మనసుకు, ఆత్మకు సంబంధించిన భావోద్వేగమని పేర్కొంది.
పెళ్లి తర్వాత తన కెరీర్, వ్యక్తిగత గుర్తింపుకు ప్రాధాన్యత తగ్గిపోయిందని సప్నా ఆవేదన వ్యక్తం చేసింది. భార్యగా, తల్లిగా, కోడలిగా బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో తనను తాను పట్టించుకోవడం మానేశానని చెప్పింది. ఇకపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. మరో పెళ్లి గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. తన ప్రేమకు అర్హుడైన వ్యక్తి ఎదురైతేనే మరో బంధం గురించి ఆలోచిస్తానని తెలిపింది. కాగా, సప్నా చౌదరి 2020 జనవరిలో హర్యానా నటుడు, గాయకుడు వీర్ సాహును రహస్యంగా వివాహం చేసుకుంది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిగ్‌బాస్ 11తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సప్నా తాజా నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!