

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ప్రజలకు పలు హామీలను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.5,000 చొప్పున భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు రెండు నుంచి మూడు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించింది. రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం లఖ్‌నవ్‌లో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్ పత్ర్ – జన్ మన్ కా మ్యానిఫెస్టో 2027’ పేరుతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో రైతులు, యువత, విద్యార్థులు, ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. మహిళల సంక్షేమంపై ప్రత్యేక మ్యానిఫెస్టోతో పాటు జిల్లాలవారీగా కూడా ఎన్నికల ప్రణాళికలను విడుదల చేస్తామని తెలిపారు.
మరోవైపు, ఉత్తరప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లఖ్‌నవ్‌లో సామాజిక్ పరివర్తన్ మోర్చా కూటమి నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఈసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీసం ఉన్న వ్యక్తే అవుతారని అన్నారు. గడ్డం, మీసాలు లేనివారికి, తలపై జుట్టు లేనివారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లను ఉద్దేశించినవిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ కూటమి నేత చంద్రశేఖర్ ఆజాద్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ఒవైసీ జోస్యం చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!