

వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్‌కు బదులుగా ఓటరు గుర్తింపు కార్డులను వినియోగిస్తామని కేంద్రం ప్రకటించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ఈ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇది కేవలం ఓట్ల చోరీ మాత్రమే కాదని, పౌరుల హక్కులను కూడా హరించడమేనని విమర్శించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ స్థానంలో ఓటరు కార్డులను ఉపయోగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ శుక్రవారం తన నివాసంలో పార్టీ నేతలకు తేనీటి విందు ఇచ్చారు. ఈ సమావేశంలో ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. మరోవైపు, ‘సర్’ అంశంపై బహిరంగ చర్చకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. ఈ విషయంలో ప్రధానిని తికమక పెట్టకుండా చర్చకు ఒప్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సూచించారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని, ‘డరో మత్’ (భయపడకండి) అంటూ హిందీలో ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!