

తాను పదేపదే చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించి, ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో రెండు వర్గాల సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు తగిన న్యాయం జరగడం లేదనే విషయాన్ని తాను పలుమార్లు ప్రశ్నించినట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం కూడా ఎస్సీలు సమాజంలో వివక్ష, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. మరోవైపు, ఆదివాసీలను వివిధ కారణాలు చూపుతూ అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులు తమ అస్తిత్వం, జీవనాధారమైన ‘జల్-జంగల్-జమీన్’పై హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారం, అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వారికి ప్రయోజనం చేకూరుస్తుందని కవిత అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!