

రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు లభించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలుగా మారుతున్నాయని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఉపయోగించుకునేందుకు తమ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని జగన్ గుర్తుచేశారు. వీటితో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రామాయపట్నం పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముదాయం, ఇండోసోల్ సోలార్ ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రం వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా భారీ పెట్టుబడులతో పాటు వేలాది ఉద్యోగావకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసం వివిధ వేదికలపై తమ హయాంలో ప్రారంభించిన పోర్టుల ప్రాజెక్టులను ప్రస్తావిస్తున్నారని వ్యాఖ్యానించారు. దిగుమతులు, ఎగుమతుల నిర్వహణ కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) అధికారికంగా నోటిఫై చేయడం ఈ ప్రణాళికలో మరో కీలక పరిణామంగా నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!