

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,240 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఇందుకోసం 31,614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతలో 709 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ విడతలో మొత్తం 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభమైంది. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు 19 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 24,98,312 మంది ఓటర్లు ఓటు వేయనుండగా, 2,698 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 819 సమస్యాత్మక, 597 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 5,602 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద మరో 183 కెమెరాలను అమర్చారు. ఎన్నికల విధుల్లో 3,362 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,531 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 12,831 మంది ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. వీరితో పాటు 302 మంది రిటర్నింగ్ అధికారులు, 378 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 142 మంది జోనల్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 23 కేంద్రాలు, 115 కౌంటింగ్ హాళ్లు, 842 టేబుళ్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 842 మంది సూపర్‌వైజర్లు, 2,526 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!