

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలిసారి రాష్ట్ర స్థాయి ఇండియా కూటమి సంప్రదింపుల సమావేశంలో పాల్గొంది. చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి టీవీకే తరఫున మంత్రులు ఆధవ్ అర్జున, మరియా విల్సన్ హాజరయ్యారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన భేటీలో కాంగ్రెస్, టీవీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. టీవీకే పాల్గొనడాన్ని మాణిక్యం ఠాగూర్ ప్రతిపక్ష ఐక్యతకు కీలక పరిణామంగా అభివర్ణించారు.
మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ఇండియా కూటమి తన నిరసనలను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 13, 14 తేదీల్లో తమిళనాడులో జిల్లా స్థాయి నిరసనలు, అక్టోబర్ 15న భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. అంతకుముందు అక్టోబర్ 6న ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాలతో టీవీకే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!