

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎన్నికల వ్యవస్థ, ఓటు హక్కుకు సంబంధించిన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 300 మందికి పైగా ఎంపీలు ఎన్నికల కమిషనర్‌ను కలిసి తమ అభిప్రాయాలు, ఆందోళనలు తెలియజేయడానికి వెళ్లినప్పటికీ వారితో సమావేశం కాకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఫారం-6లో మార్పులు ఇతర ఎన్నికల కమిషన్ సభ్యులతో తగిన సంప్రదింపులు లేకుండా ఎలా చేపట్టారని వంశీకృష్ణ ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నిర్వహణపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో రాజ్యాంగబద్ధమైన పాత్ర ఉందని గుర్తుచేస్తూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే పారదర్శకత, స్వతంత్రత, జవాబుదారీతనం అవసరమన్నారు. ప్రతి ఓటు వెనుక పౌరుడి హక్కు ఉందని, ఆ హక్కును కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!