

తుఫాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కావాలని పేర్కొన్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు, ఇతర నిత్యావసరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జగన్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బలహీన వర్గాలకు ఇబ్బందులు కలగకుండా తగిన సహాయం అందించాలని పేర్కొన్నారు. రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తుఫాన్ సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొని, బాధిత ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!