

బిగ్‌బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఆమెను బయటకు పంపిస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఆదివారం ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఉండటంతో హౌస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించిన నాగార్జున వారికి స్టార్స్ ఇచ్చారు. ఆశించిన స్థాయిలో ఆడలేదని భావించిన సుధీర్, ఝాన్సీ, ఆర్కే, నీతూలను జీరో స్టార్స్ విభాగంలో ఉంచారు. నరేశ్, రామ్ ప్రసాద్‌ల ఆటతీరును అభినందిస్తూ వారికి ఐదు స్టార్స్ ఇచ్చారు. ఆర్కేను ఉద్దేశించి నాగార్జున ‘నవరస మామ అంటారు.. కానీ నీలో శోక రసం మాత్రమే కనిపిస్తోంది’ అంటూ సెటైర్ వేశారు.
మరోవైపు వర్షిణికి తొలుత మూడు స్టార్స్ ఇచ్చిన నాగార్జున, ఆ తర్వాత ఆమెను జీరో స్టార్స్ విభాగానికి మార్చారు. శివకుమార్ గురించి వర్షిణి, ముకేశ్, సుధీర్, రోహిత్ కలిసి రహస్యంగా మాట్లాడుకున్న వీడియోను హౌస్‌మేట్స్‌కు చూపించారు. అందులో శివకుమార్ గురించి రోహిత్, ముకేశ్ చేసిన వ్యాఖ్యలతో పాటు, కొన్ని పదాలను సుధీర్, వర్షిణి పరోక్షంగా ప్రస్తావించిన తీరు కనిపించింది. ఆ పదాల అర్థం ఏమిటని నాగార్జున ప్రశ్నించగా, వారు సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. మీరే వాటి గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఎలా భావిస్తారో ఆలోచించారా? అంటూ ప్రశ్నించారు. ఇదే ఎపిసోడ్‌లో త్రిగుణ్‌కు సంబంధించిన మరో వీడియోను చూపించారు. అందులో వర్షిణి మాట్లాడుతూ.. త్రిగుణ్ బలహీనతపై దెబ్బ కొడతానని, తాను అలా చేస్తే అతను తట్టుకోలేడని వ్యాఖ్యానించినట్లు కనిపించింది. దీనిపై త్రిగుణ్ సరైన సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని తెలిపారు. నాగార్జున అతడి ఆటతీరును అభినందించి ప్రత్యేక బహుమతి అందించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!