

బిగ్ బాస్ తెలుగు 10లో కెప్టెన్సీ టాస్కులు ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో పోటీతో పాటు వ్యక్తిగత విభేదాలు కూడా మరింత ముదిరాయి. ఇప్పటికే రెండు టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్కుల్లో హోరాహోరీగా పోటీపడుతుండగా.. గ్రూపుల మధ్య వ్యూహాలు, వ్యక్తిగత సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో ఎలిమినేషన్ బరిలో ఉన్న కంటెస్టెంట్లు ప్రేక్షకుల మద్దతు కోరుతున్నారు. తొలిసారి నామినేషన్‌లోకి వచ్చిన నరేష్ కెమెరా ముందుకు వచ్చి తనకు ఓట్లు వేసి సేవ్ చేయాలని ప్రేక్షకులను కోరాడు. మరోవైపు రోహిత్ తన ‘అగ్నిపరీక్ష’ బ్యాచ్ సభ్యులతో మాట్లాడుతూ దేబ్జానీపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు అపూర్వను కూడా తమ గ్రూప్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు కనిపించింది.
ఇదిలా ఉండగా.. కత్తుల టాస్క్ హౌస్‌లో మరోసారి వివాదానికి దారితీసింది. ఝాన్సీ తన దగ్గర ఉన్న కత్తులను మష్రూమ్ రూమ్‌లో దాచుకోవడంతో షాలినితో వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై ముకేశ్, త్రిగుణ్ కూడా ఝాన్సీతో చర్చకు దిగారు. రెండు కంటే ఎక్కువ కత్తులు ఎవరి వద్ద ఉంటే ఆరో వారంలో ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ ప్రకటించడంతో కంటెస్టెంట్లు కత్తుల కోసం పోటీపడ్డారు. త్రిగుణ్ దగ్గరకు ఓ కత్తి చేరడంతో అమన్‌తో అతడికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అమన్ త్రిగుణ్ మణికట్టును పట్టుకోవడం, త్రిగుణ్ అతడిని తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో రోహిత్ తన గ్రూప్ సభ్యులకు మద్దతుగా జోక్యం చేసుకున్నాడు. అనంతరం కెప్టెన్సీ కోసం ‘ఫైర్ అండ్ లావా’ టాస్క్ నిర్వహించారు. భైరవ రెడ్ టీమ్ తరఫున వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్.. సప్తశక్తి బ్లూ టీమ్ తరఫున త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, సృష్టి పోటీపడ్డారు. నిర్దేశించిన మార్గంలో డ్రమ్స్‌ను తీసుకెళ్లి రంధ్రాలు ఉన్న బోర్డులో ఉంచే ఈ టాస్క్‌లో భైరవ రెడ్ టీమ్ విజయం సాధించింది. అయితే టాస్క్ తర్వాత కూడా గ్రూపిజంపై చర్చ కొనసాగింది. రోహిత్ షాలినికి మద్దతు ఇవ్వడంతో ఇద్దరి మధ్యే మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు మద్దతు ఇస్తున్నట్లు బయట చూపించుకోవద్దని షాలిని చెప్పగా.. తన టీమ్ కంటే బయటివారికి మద్దతు ఇస్తున్నానని విమర్శలు రావడంతో రోహిత్ స్పందించాడు. దీంతో హౌస్‌లో గ్రూపులు, స్నేహాలు, వ్యక్తిగత సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!