

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకోగా, నాలుగో వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. తొలి వారంలో ఛైత్ర, రెండో వారంలో కృష్ణుడు ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో ఎలిమినేషన్ జరగలేదు. ఇక నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఐదో లేదా ఆరో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ బుల్లితెర నటి కావ్యశ్రీ పేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది.
కావ్యశ్రీకి బుల్లితెరపై మంచి గుర్తింపుతో పాటు అభిమానుల ఫాలోయింగ్ కూడా ఉంది. గతంలోనూ ఆమె బిగ్ బాస్ తెలుగు షోలోకి వస్తుందనే ప్రచారం పలుమార్లు జరిగింది. అయితే ఇప్పటివరకు ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టలేదు. బిగ్ బాస్ తెలుగు 10లోనూ ఆమె మెయిన్ కంటెస్టెంట్‌గా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అది నిజం కాలేదు. ఇదిలా ఉండగా, ఆహాలో ప్రసారమవుతున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె కుకింగ్ కామెడీ షోలో యాదమ్మ రాజుకు జోడీగా కావ్యశ్రీ కనిపించింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఆమె కనిపించకపోగా.. ఆమె స్థానంలో యష్మి యాదమ్మ రాజుతో కలిసి కనిపించింది. దీంతో కావ్యశ్రీ ఎక్కడ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే ఆమె ఆ షో నుంచి తప్పుకున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై కావ్యశ్రీ లేదా బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!