

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసింది. అక్టోబర్ 4వ తేదీతో అతని కాంట్రాక్ట్ ముగియగా, గువాహటిలో జరిగిన తాజా సెలక్షన్ కమిటీ సమావేశానికి అగార్కర్ హాజరుకాలేదు. దీంతో అతని పదవి నుంచి వైదొలగినట్లేనని స్పష్టమవుతోంది. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ 'క్రిక్‌బజ్' తన కథనంలో ఈ వివరాలను వెల్లడించింది. అగార్కర్ గైర్హాజరీలో, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝాను సమావేశానికి ఛైర్మన్‌గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం.ప్రస్తుతం టీమిండియా తదుపరి చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓఝా పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత సెలక్షన్ ప్యానెల్‌లో ఉన్నవారిలో అత్యధిక టెస్టులు ఆడిన అనుభవం ఓఝాకే ఉంది. ఓఝా 24 టెస్టులు ఆడగా, శివ్ సుందర్ దాస్ 23, ఆర్పీ సింగ్ 14, అజయ్ రాత్రా 6 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఈ సీనియారిటీ కారణంగానే ఆయనకు ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. "బీసీసీఐలో ఏదైనా జరగవచ్చు. కానీ, ఓఝా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు" అని బోర్డు వర్గాలు పేర్కొన్నట్లు సదరు కథనం తెలిపింది.అయితే, చీఫ్ సెలక్టర్ ఎంపిక ప్రక్రియపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఓఝానే పూర్తిస్థాయి ఛైర్మన్‌గా కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనేది తేలాల్సి ఉంది. గత కొంతకాలంగా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ పేరు కూడా ఈ పదవికి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సెలక్షన్ కమిటీ ఈ వారంలో సమావేశమై న్యూజిలాండ్‌తో జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కు జట్లను ఖరారు చేయనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. కాగా, కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే చీఫ్ సెలక్టర్‌కు అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. వచ్చే ఏడాది 2027 ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేసే బృహత్తర బాధ్యత వారిపై ఉంటుంది. జట్టుకు సరైన ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!