

ఢాకాలో జరిగిన మెన్స్ బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ తీవ్ర వివాదానికి దారితీసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయినప్పటికీ, మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించడంపై భారత జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ టీమిండియా ప్రెజెంటేషన్ సెర్మనీని బహిష్కరించింది. ఫైనల్ మ్యాచ్ నిర్వహించకుండానే పాకిస్థాన్‌కు ట్రోఫీ అందజేయడాన్ని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) తప్పుబట్టింది. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని టెక్నికల్ కమిటీ నిర్ణయించినప్పటికీ, వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (WBCC) అధ్యక్షుడు సుల్తాన్ షా ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టారని భారత బోర్డు ఆరోపించింది. ఆయన ఆదేశాల మేరకే మ్యాచ్ రెఫరీ పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారని పేర్కొంది.
ఈ వ్యవహారంపై CABI కార్యదర్శి శైలేంద్ర తీవ్రంగా స్పందించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడబోమని స్పష్టం చేశారు. నెట్ రన్‌రేట్‌ను సాధారణంగా క్వాలిఫయింగ్ దశలో జట్ల స్థానాలను నిర్ణయించడానికి మాత్రమే ఉపయోగిస్తారని, ఫైనల్ మ్యాచ్ జరగని పరిస్థితిలో విజేతను ప్రకటించడానికి దానిని ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్ ప్లేయింగ్ కండిషన్స్లోని క్లాజ్ 27ను నిర్వాహకులు తప్పుగా అన్వయించారని ఆరోపించారు. సాధారణంగా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయిస్తారని, అలాంటి అవకాశం లేకుండా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం సంప్రదాయమని తెలిపారు. ప్లేయింగ్ కండిషన్స్‌లో చేసిన మార్పులపై కెప్టెన్ల సమావేశంలో చర్చ జరగలేదని, నిర్వాహకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని CABI ఆరోపించింది. ఈ వివాదంపై స్పష్టత వచ్చే వరకు పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను కొనసాగించబోమని ప్రకటించడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!